18, మార్చి 2011, శుక్రవారం

రాఘవులు దీక్ష

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మరి కొద్ది మంది నాయకుల తో కలిసి నిరవధిక దీక్ష చేపట్టారు .50 డిమాండ్లలో sc ,st ల నిదులకి సంబంధించినవి ప్రధానమైన డిమాండ్లుగా వార్తా పత్రికల ద్వారా అర్థం అవుతుంది .కెసిఆర్ గారు నిరాహార దీక్ష చేసిన తరువాత వచ్చిన ప్రజా స్పందన చూసి మన రాష్ట్ర రాజకీయ నాయకులూ గత ఒకటిన్నర సంవత్సరంగా విరివిగా నిరాహార దీక్షలు చేస్తున్నారు .అయితే tdp , కాంగ్రెస్ లాంటి పార్టీ లు competetive politics లో బాగంగా ప్రతినిత్యం చేసే నిరాహార దీక్షలకి , సిపిఎం పార్టీ నాయకుల నిరాహార దీక్షలకి కొంత తేడా ఉంది .నాయకులు చేసే వివిధ ఉద్యమాల పట్ల మన అభిప్రాయాలు మనకు ఉంటాయి.నాయకుల ఉపన్యాసాలని,ఉద్యమాలని గత అనుభవాల ,ఆ పార్టీ గత చరిత్ర ఆధారంగా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాము .ఈ సందర్బం లో మనకు అనేక సందేహాలు కలగవచ్చు .అనేక ప్రశ్నలు ఉదయించ వచ్చు .మనకి అర్థమైనంత వరకు ప్రజాస్వామ్యం లో నిరాహార దీక్ష ఒక అంతిమ పోరాట రూపం .సభలు ,సమావేశాలు ,రాలీలు ధర్నాలు మొదలగు పోరాట రూపాల ద్వారా లక్ష్యాలు సాదించటం విఫలం ఐనప్పుడు అంతిమంగా నిరాహార దీక్ష ను ఎంచు కోవటం జరుగుతుంది .ఈ నిరాహార దీక్ష అనే పోరాట రూపాన్ని ఎంచు కొన్నపుడు లక్ష్యం పట్ల ప్రజలలో తీవ్రమైన కాంక్ష ఉండాలి ,లేక పొతే ప్రజాస్వామిక పోరాట రూపాల్లో ఎంతో గొప్పదిగా పరిగణించబడే నిరాహార దీక్ష దాని పవిత్రత ను కోల్పోవచ్చు .కెసిఆర్ తెలంగాణా విషయం లో అనేక సంవత్సరాలు వివిధ పద్దతుల్లో పోరాడి అంతిమంగా నిరాహార దీక్ష కు దిగటం జరిగింది .నాయకుడు ఏ పార్టీ కి చెందిన వాడైనా మిగతా పోరాట రూపాల ద్వారా సాధించినదానికంటే దీక్ష ద్వారా మెరుగైన ఫలితం ఉండాలి .లేక పోతే ప్రజలలో శాంతియుత పోరాట రూపాల పట్ల నమ్మకం సడలి పోయే ప్రమాదం ఉంది .ఇప్పుడు రాఘవులు వంటి ఒక పెద్ద నాయకుడు ,ప్రజలలో సదాభిప్రాయం ఉన్న నాయకుడు ఈ నిరాహార దీక్ష పోరాట రూపాన్ని ఎంచుకోవటానికంటే ముందు ఈ డిమాండ్ల సాధన కోసం మిగతా పోరాట రూపాలని ప్రయత్నించి చూసారా ?ఇప్పుడు వారు చెబుతున్న డిమాండ్లలో దేనికోసమూ వారు గడిచిన రెండు మూడేళ్ళలో పెద్ద ఎత్తున ప్రజలని కదిలించినట్టు గాని పోరాడినట్టు గాని మనం చూడలేదు .sc ,st ల గురించి రాఘవులు మాట్లాడినప్పుడు ,ఆయన ఒక జాతీయ పార్టీ కి చెందినవాడు కాబట్టి మనం అనివార్యంగా వారి పార్టీ అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో ఎంత బాగా పని చేసారని ఆలోచిస్తాము .వారి పార్టీ సుదీర్ఘ కాలం అధికారం లో ఉన్న బెంగాల్ లో sc ,st ల అభివృద్ధి కి పెద్దగా కృషి చేసిన దాఖలాలు ఏమి లేవు .పైగా స్వతంత్ర భారత చరిత్ర లో కనీ వినీ ఎరుగని విధంగా నాలుగు వేల దళిత రెఫ్యూజీ కుటుంబాలను, అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం లోనే చంపిన చరిత్ర వారిదని బెంగాలి దళిత మిత్రులు ఆరోపిస్తున్నారు . caste certificate పొందటం, e గవర్నన్స్ అమలవటం మొదలైన తరువాత చాల రాష్ట్రాల్లో చాల సులువు అయ్యింది .ఇంకా కేస్ట్ సర్టిఫికేట్ తీసుకోవటానికి చెప్పులరిగేల తిరగాల్సిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది బెంగాలే .మన రాష్ట్రం లో కేస్ట్ సర్టిఫికేట్ mro ఇస్తాడు కాని బెంగాల్లో sub collector.ఒక సబ్డివిజన్ లో ఎన్ని మండలాలు?ఒక్క రోజులో ఎన్ని సర్టిఫికేట్ ల మీద సంతకం పెట్ట గలడు.?అంటే మన బెంగాలి దళిత మిత్రులు ఉద్యోగాల గురించి ఆలోచించటం అటుంచి కేస్ట్ సర్టిఫికేట్ తీసుకోవటం లోనే నీరస పడి పోవాలన్నమాట . కమ్యూనిస్టుల ద్రుష్టి కోణం నుండి ఫ్యూడల్ రాష్ట్రమైన ap లో, దళితుల విధ్యాబ్యున్నతి కోసం అనేక మంచిప్రయత్నాలు జరిగాయి .రెసిదేన్షియాల్ స్కూల్స్ ,సంక్షేమ హాస్టళ్ళు దళితులు ఉన్నత అవకాశాలు అందుకోవటానికి తోడ్పడ్డాయి .కాని బెంగాల్లో ఇటువంటి ప్రయత్నం ఏమీ జరగలేదు .దళితులకు ఆదివాసులకు చెందిన ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిర్లజ్జగా ఓపెన్ కాటగిరి కి కన్వెర్ట్ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది బెంగాలే. మనం bjp వాళ్ళను అపార్థం చేసుకొంటాం కాని "ప్రతిభ "సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నది సిపిఎం వాళ్లే.అన్ని రాష్ట్రాల్లో ఉన్నత పదవుల్లో ఎంతో కొంత కులాల మధ్య సమతుల్యత పాటించడానికి ప్రయత్నిస్తారు .కాని బెంగాల్లో అటువంటిదేమి ఉండదు .కాబినెట్ మొదలుకొని కలెక్టర్ పదవుల వరకు అంతట సామాజిక అన్యాయమే .ఫ్యూడల్ ap లో దళితుడు ఏ జిల్లకైనా కలెక్టర్ అవుతాడు కాని బెంగాల్లో కలకత్తా చుట్టూ పక్కలున్న అభివృద్ధి చెందిన జిల్లాలకు దళితుడికి కలెక్టర్ పోస్టింగ్ ఇవ్వరు గాక ఇవ్వరు. రాఘవులు గారు ..౩౦ ఏళ్ళుగా మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం లో ప్రభుత్వం పని తీరు ఇంత అమానుషంగా ఉంచుకొని మీరు ఇక్కడ నిరాహార దీక్ష చేయటం ఏంటని మా మది లో ప్రశ్న తలెత్తడం తప్పంటారా?

11, మార్చి 2011, శుక్రవారం

ఓయి తెలుగువాడా !

విగ్రహాలు ద్వంసం అయ్యాయి .దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ?ఎలా ప్రతిస్పందించాలి ?మొట్ట మొదటగా మనం మనుష్యులం కాబట్టి హింసని ప్రోత్సహించం కాబట్టి ఈ చర్యని ఖండిస్తాం .మనలో కొంత మందిమి భావోద్వేగాలు ఎక్కువగా ఉన్న సమయాల్లో మన సొంత అజెండాలను ప్రచారం కూడా చేసుకొంటాం .కొంత మందిమి కర సేవకుల బాబ్రీ విద్వంసాన్ని ఉటంకించి మన లౌకికత్వాన్ని చాటుకోవడం తో పాటు మా పార్టీ బా జ పా కి వ్యతిరేఖం అని ప్రజలను ఒప్పించాలను కొంటాం.ఇంకొంత మందిమి ఎన్ టి ఆర్ మాత్రమే ఒక్క మగాడు అని చాటి చెప్పా లనుకుంటాం .ఇంకా కొంత మందిమి మనకు తెలిసిన కవితలని ఉటంకించి మన పాండిత్యాన్ని నిరూపించు కోవాలనుకొంటాం . ok it is an occasion to prove our love for the language ,to propagate our ideologies ,to reinforce stereotypes.

భారత దేశం ఒక జాతి గా గడిచిన అరవై సంవత్సరాలుగా మనుగడ సాధించడమే కాకుండా మనమంతా ఒకే జాతి అనే భావన అభివృద్ధి చెందింది కూడా .కొన్ని చిన్న చిన్న అపశ్రుతులు ఉన్నప్పటికీ ఎన్నో కులాలు ,మతాలు ,ప్రాంతాలుగా ఉండిన భారత దేశం ఐక్యంగా మనుగడ సాధించి అభివృద్ధి సాధించడం అద్బుతం .భారత దేశ పాలకులు ఈ దేశంలోని భిన్నత్వాన్ని ఆమోదించి గౌరవించడమే కాకుండా భిన్న సమూహాల ఆశలని ఆకాంక్షలని ప్రతిఫలించే వ్యవస్థలకి అవకాశం కల్పించడం ఈ దేశ సమగ్రతను కాపాడడానికి ఒక ముఖ్య కారణం కావచ్చు .దీన్నే మనం చిన్నప్పుడు unity in diversity అని చదివి వంటబట్టిచ్చుకోన్నాం .

అయితే వివిధ రాష్ట్రాలుగా మనుగడ సాదిస్తున్న భారతదేశం ప్రాంతీయ ఆశలని ఆకాంక్షలని సంతృప్తి పరిచినప్పటికీ ,ఒకే రాష్ట్రంలో ఉన్న భిన్న అస్తిత్వ భావనలకి సరైన ప్రాతినిధ్యం కల్పించ లేక పోయింది .ap విషయంలో ఒక ప్రాంత అస్తిత్వాన్ని విస్మరించడం ,వారి సాంస్కృతిక చిహ్నాలని నిర్లక్ష్యం చేయడం అనే దుర్మార్గం కొంత ఎక్కువగానే జరిగింది .సమ్మక్క ,సారక్క ,కొమరం భీం ,చాకలి ఐలమ్మ ,దొడ్డి కొమరయ్య అందరూ ఎందుకు సరైన ప్రాతినిధ్యానికి నోచుకోలేదు అనేదానికి మనదగ్గర స్పష్టమైన సమాధానాలు లేవు .పొనీ ఇప్పుడైనా దిద్దుబాటు చర్యలేమైన చే పడతామా అంటే ,అదీ లేదు .

నన్నయ్య ,శ్రీ కృష్ణదేవరాయలు ,అన్నమయ్య ,శ్రీ శ్రీ ,జాషువా అందరూ మనం ఎంతో అపరూపంగా మన గుండెల్లో పదిల పరుచుకొన్న మన సాంస్కృతిక నాయకులే .కానీ మనలో కొంత మందిమి వారి విగ్రహాలను చాల అవలలీగా నాశనం చేయగలుగుతున్నామంటే ఎక్కడో ఏదో పెద్ద లోపం ఉందనిపిస్తుంది .అరిచి గోలపెట్టి రాళ్లేసినంత మాత్రాన బెదిరి పోయే వాళ్ళు ఎవరూ లేరు.లగడపాటి ad ఓయి తెలుగువాడా ప్రతి రొజు గంట సేపు వేసినా లాబం లేదు .తెలంగాణా వాళ్ళను ఆంధ్రులు తెలబాన్ అని  అనేస్తే వాళ్ళు  ఆంధ్రులను ఆటవికులు అనెయ్యొచ్చు .ఈ మధ్య కాలంలో నిజాయితిగా ప్రవర్తిస్తున్న అతి కొద్దిమందిలో ఒకరైన కతి పద్మారావు గారు చెప్పిన్నట్టు తెలుగు జాతికి ఉమ్మడి సంస్కృతి ,వారసత్వం ఉన్నాయి .దీన్ని మనం కాపాడుకోవాలి .దానితోపాటే తెలంగాణా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన విభజన జరగాలి .భిన్న ప్రాంతాల ఆశలు ఆకాంక్షలు తీరాలి .తెలుగు జాతి సుఖ సంతోషాలతో వికసించాలి.

29, సెప్టెంబర్ 2010, బుధవారం

వయా కొత్తగూడెం


ఇక్కడోసారి దిగకూడదూ
ఒక కొత్త లోకాన్ని పలకరించోచ్చూ
మనిషి తనను తానుపొరలు పొరలుగా తవ్వుకుంటూ
ఒకానొక మహా శూన్యాన్ని ఆవిష్కరించే
అరుదైన దృశ్యాన్ని చూసి పోవచ్చూ

కేవలం బతకటం కోసం
ప్రతి రోజూ సమాధి ప్రవేసాలు చేస్తూ
ప్రతి నిత్యం ఒక కొత్త జన్మ ఎత్తుతూ
మనిషి తన మాంసాన్ని లారీలకూ ,గూడ్సు బోగీలకూ ఎత్తి
పారిశ్రామిక సింహాలకు సరఫరా చేసే
ఒక విచిత్ర సత్యాన్ని అనుభవించ వచ్చూ

ఎలాగూ వచ్చిన వాళ్ళు వచ్చారు
కాసేపు ఇక్కడ నిలబడ కూడదూ
ఆకలి తట్టలో అడవిని మోసుకొచ్చి
పట్టణాల విస్తర్లలో అన్నమయ్యే బంజారా బెహేన్ల ఒంటి మీద
పగిలి పోయిన సూర్యుడి ముక్కల్లో
మీ బీట్ట వారిన ముఖాలు చూసుకోవచ్చూ

అలసి పోయిన సింగరేణి ఓపన్ కాస్ప్ గొంతులోకి
బ్రాందీ చుక్కలుగా ఒలుకుతున్న గని కార్మికుల్ని ముట్టుకుని
సూర్య మండల స్పర్శని అనుభవించ వచ్చు రండి
ప్రజా స్వామ్యం ఉచ్చులు పరుచుకు కూచున్న
వ్యాపారం పులి వల్లించే కమ్యునిస్ట్ సూక్తులు విందూరు కానీ

జీతాన్నంత చక్ర వడ్డీ గద్ద తన్నుకు పోతే
ఖాళీ మందు సీసాలయి ఒట్టి పోయిన సంసారాల్ని చూద్దురు గానీ
అలిసి పోయి వచ్చారు
ఆ బేరియం కంపెనీ విడిచే విష వాయువు నాఘ్రానించండి
భూమధ్య రేఖా ప్రాంతపు వెచ్చదనాన్ని ఫీలవ్వండి

సింగరేణి చవక దుకాణంలో
నరాలుబ్బుకోచ్చిన అకాల వృద్ధాప్యాన్ని
అతి చవగ్గా కొనుక్కుని మీ ఇళ్ళలో అలంకరించుకోండి
కలగలుపు నాగరికతలోంచి అసంబద్దంగా రూపెత్తుకున్న
ఒక బానిస సంస్కృతిని ఇక్కడ గమనించండి

మళ్ళీ -వస్తారో రారో
ఒక్కసారా బొగ్గు బావిలోకి దిగి చూడ కూడదూ
ఒక శాశ్వత సూర్య గ్రహణ అనుభవాన్ని చవిచూడవచ్చు
అభద్రతా పెళుసు కిందపడి అల్లలాడే
లేత పుస్తెల గుండె కోతల సంగీతాన్ని విని పోవచ్చు

రైళ్ళూ ,పరిశ్రమలూ ,ఈ దేశమూ బొగ్గుతో కాదు
గని కార్మికుల నెత్తురుతో నడుస్తున్నాయన్న నిజాన్ని తెలుసుకోవచ్చు

ఎలాగూ ఇక్కడిదాకా వచ్చారు కదా
ఈ ఉద్యమం వాకిట్లోకి అడుగుపెట్టకూడదూ
మృత వీరులకో దణ్ణం పెట్టి ఈ నెత్తుటి ముర్రేడులో మునిగి పునీతులవ్వోచ్చూ
ఒక్కసారీ కొత్తగూడెంలో దిగకూడదూ
జీవితంలో ఒక్కపారైనా
బతికిన క్షణాలు అనుభవించిపోవచ్చూ .....మద్దూరి నగేష్ బాబు